AI Videos Political War: టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. ఏఐ పొలిటికల్‌ ఫైట్..

AI Videos Political War: రోజు రోజుకీ టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతుంది.. అది కూడా అందిపుచ్చుకుంటున్నారు రాజకీయ నేతలు.. ఇప్పుడు అంతా ఏఐ వీడియోల కాలం నడుస్తుండగా.. మేమేం తక్కువ అన్నట్టు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడానికి కూడా ఏఐ వాడేస్తున్నారు.. ఇక, చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ రాజకీయ పోరు కొత్త రూపు దాల్చింది. సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు ఏఐ వీడియోలతో పరస్పరం విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి, ఆయన అనుచరులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గురజాల వీడియో పోస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌, ఇసుక, భూ దందాలతో కోట్లు దోచేశారని‌.. అక్రమ లిక్కర్ వ్యాపారం చేశారంటూ అందులో ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ సోషల్‌ మీడియా నుంచి ఘాటైన కౌంటర్‌ వచ్చింది. ఎమ్మెల్యేను టార్గెట్‌ చేస్తూ ‘బటర్‌ బన్ను ఎమ్మెల్యే’ అంటూ ఏఐ వీడియోను రూపొందించింది. రెండేళ్లుగా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉంటూ భూములు, ఇసుక, గ్రావెల్‌, గ్రానైట్‌ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. టోకెన్‌ అడ్వాన్స్‌ల పేరుతో భూములు కబ్జా చేస్తున్నారంటూ వైసీపీ వీడియోలో విమర్శలు చేసింది.వ్యక్తిగత విమర్శలతో‌పాటు వారి వారి అనుచరులు చిట్టా ఇరు పార్టీలు బయట పెట్టాయి.. దీంతో చిత్తూరులో రాజకీయ విమర్శలు ఇప్పుడు బహిరంగ సభలు, ప్రెస్‌ మీట్లను దాటి ఏఐ వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలోకి చేరాయి. ప్రస్తుతం ఈ విడియోలు వైరల్ గా మారాయి…